సత్యదేవుని పూజ
-----------------------------------------+--
శ్రీ గణాధిప నిలిచి నా చిత్తమందు
సత్య దేవుని కీర్తనల్ సలుప గలుగు
శక్తినొసగుము కూర్మితో శక్తి పుత్ర
శరణుశరణము నీ దివ్య చరణ యుగళి
వాణీ వనరుహ భవు హృది
రాణీ యళినీలవేణి రాజిత వీణా
పాణీ విద్యాధరిక
ళ్యాణీ కరుణించు నను దయామృత వృష్టిన్
మాటవై పాటవై నా మదిన్ నిల్వుమా
బాటవై గమ్యమై పాలనన్ సేయుమా
కోటవై మూటవై కోర్కెలన్ దీర్చుమా
సాటినీకేదిలన్ సాకుమా రాఘవా
క్షీర సాగర మందున శేష పాన్పు
పాన్పునన్ పవళించెడి పరమ పురుష
పురుష శ్రేష్ఠ నీ పదసేవ పుణ్య వరము
వరద లక్ష్మీ సమేతభివందనములు
హేమపీఠము నొనగూర్తు కోమలాంగ
రత్నఖచితాసనంబుల రయముగూర్తు
అర్ఘ్య పాద్యాచమనములనందుకొనుము
సత్యనారాయణా స్వామి శరణుశరణు
పాలు పెరుగు ఘృతము తేనె పంచదార
కలిపి భక్తితోనభిషేకములను జేసి
పంచసూక్తములాదిగా పఠన జేసి
శుద్ధ గంగాజలాలతో శుద్ధిజేతు
పట్టు పీతాంబరము కట్టి పరవశించి
దివ్య యజ్ఞోపవీతాల తీర్చి దిద్ది
మంచి గంధము తిలకమునుంచి మ్రొక్కి
పసుపు కుంకుమల్ నర్పించి ప్రణుతి జేతు
మంచి పరిమళాల మల్లె పూవుల మాల
మాధవానర్పింతు మనసుదీర
కనకాంబరాలతో కళ్యాణమాలను
వేడ్కదీరగ వేతు వేదవేద్య
రంగురంగులమేను రాజిల్లి శోభించ
జాజిపూమాలతో పూజసేతు
చామంతి పూబంతి చంపక మాలలు
గోవింద నీ చెంత కులుకజేతు
తులసిదళముల నర్చింతు తోయజాక్ష
బిల్వ దళముల పూజింతు విమల చరిత
పారిజాతాల సేవింతు పద్మనాభ
నిత్య పూజన సుమములు సత్యదేవ
చందనాగరు ధూపాలు సచ్చరిత్ర
గోఘృతాన్విత దీపాలు కూర్మరూప
పంచ భక్ష్యాలు భోజ్యాలు పాపనాశ
గొనుము దయగను మా పైన కువలయాక్ష
మంగళము రమా నాయక
మంగళము సురేంద్ర వంద్య మంగళకర శా
రంగ ధరా శుభ కప్పుర
మంగళ హారతి గొనుమిదె మాధవ కూర్మిన్
నిఖిల లోకాలకాధార నియతమైన
ప్రాణి జడముల రూపుగా బరగుచున్న
ఆది మధ్యాంత రహితమై అలరు పాద
యుగళమా మంత్ర పుష్పము యొప్పగొనుము
మొదటికథ
------------------------
పుణ్య నైమిశారణ్యాన ధన్య మునులు
శౌనకాదులు కోరిరి శౌరి కథలు
ఇహము సౌఖ్యము పరము రమేశ పదము
నొసగు వ్రతమును ప్రేమతో నుడువు మనిరి
రోగ పీడల ద్రోసి యారోగ్యమొసగి
వాంఛితంబుల నెరవేర్చి భాగ్యమొసగి
కలియుగంబున శ్రేష్ఠమై యలరు వ్రతము
పూని చెప్పగా కోరిరి మౌనివరులు
వ్యాసశిష్యుడు శుభ దరహాసయుతుడు
సూత పౌరాణికుండు సుశ్రోతల గని
మున్ను నారదుడీరీతి విన్నవించె
విష్ణు మూర్తితో నాకథ వినుడి మీరు
నారదముని లోకములను
నారయ కృపచే వెడలె సునాయస రీతిన్
వారిజనాభుని స్మరణన
జేరెను మన మనుజ లోక చింతలు దీర్పన్
నానా యోనుల బుట్టుచు
నానా జన్మల కృతముల నాబీలముతో
నానా యిడుముల కుందుచు
నానాటికి కృంగు మనుజ నాశము గనియెన్
ఒరుల కష్టము నష్టము నరసినంత
చేయ గలిగిన సాయమున్ చేయవచ్చు
బాధదీరు నుపాయమున్ బోధ చేయ
గలుగు వైకుంఠ వాసునిన్ గనగ జనియె
శంఖ చక్ర గదయు చక్కని వనమాల
నాల్గు చేతులందు వెల్గువాడు
శేషశాయి భక్తపోషణా వరదుండు
భానుకోటిప్రభలనీనుచుండె
అట్టి నారాయణున్ జూచి
భాషకందవు మనసున పట్టుబడవు
ఆదిమధ్యాంత రహితుడవయ్యనీవు
భక్త జనముల యార్తిని బాపుకరుణ
వందనము భక్తమందార వాసుదేవ
వందనములు మధుసూధన
వందనములు వనజనేత్ర వనరుహనాభా
వందనమభివందనములు
వందిత వదనారవింద వైకుంఠ పతే
అనుచు నుతులజేయు అమరమౌనీశుని
కనులజూచి మిగుల కనికరించి
రాక కారణమును రయముగ తెలుపంగ
ఆనతిచ్చెహరియు నమిత కరుణ
మర్త్య లోకము నందున్న మానవాళి
పలు విధంబుల కష్టాలనలిగినారు
జన్మజన్మాల పాపాల ఛాయ మాసి
ముక్తినొందెడి మార్గమున్ ముదము జూపు
అనిన నారదునితో నారాయణుండు
లోక హితమును కోరుచు ప్రాకటముగ
యోగ్యమగు ప్రశ్న నడిగిన యోగివర్య
ఏడు లోకాలు కాలాలు మూడు గనని
వ్రతమునొక్కటి చెప్పెద యతికులేంద్ర
తనవలన పరులవలనిట
యొనగూరిన దుఃఖ గరిమ నొప్పుగ మాన్పున్
ధనధాన్యపుత్ర సంపద
ననయము సర్వత్ర జయము నలరగజేయున్
సంతసంబొనగూర్చు చింతలెన్నోదీర్చు
సిరిసంపదలనెల్ల కురియు వ్రతము
ఆయురారోగ్యాల నమిత సౌభాగ్యాలు
ఐహికానందాల నలరు వ్రతము
కష్టాలతొలగించి నష్టాలు వదిలించి
మనుటమార్గము జూపు మంచివ్రతము
శాంతిని కలిగించి సంతాన ఫలమిచ్చి
సర్వత్ర జయమిచ్చి సాకు వ్రతము
భక్తి భావాన పూజించ పలుకువ్రతము
కమలనాథుని దరిజేర్చి కాచువ్రతము
జన్మ జన్మాల పాపమున్ జార్చు వ్రతము
సత్యనారాయణ వ్రతమె సత్య పథము
మాఘమో వైశాఖ మాసమో కార్తీక
మాసమో యేదేని మంచిదగును
ప్రీతితో రణమన్న భీతితో దారిద్ర్య
బాధతోనొనరించ భాగ్యమిడును
స్పూర్తితో మదిలోని ఆర్తితో బలమైన
వ్యాధితో చేయగా వరమునిడును
ప్రేమతో సంతాన లేమితో సంసార
గ్లానితో సలుపంగ లాభమగును
పౌర్ణిమందునేకాదశీ పర్వమందు
సూర్యసంక్రమణంబను శుభదినమున
మాసమాసము ప్రతియేడు మాధవుడిని
విధిగనర్చనల్ సేయంగ ముదమునిడును
అనుచు నారాయణుండన మునివరుండు
తెలియగోరుచు వినయాన పలికె నిటుల
ఇట్టి వ్రతమును నొనరించు విధమదేది?
ఏది ఫలమది?చేసినారెవరదెపుడు?
ఒక్క మాసమునందలి నొక్కదినము
ఉదయమే లేచి శుద్ధియై యుపవసించి
అస్తమయమును దాటిన యమిత భక్తి
స్వామి వ్రతమును సేయంగ లేమిలేదు
బంధుజనములు మిత్రులు భక్తవరులు
విప్రవర్యులు విజ్ఞులు వేడుకవగ
గుండె గుండెననానందముండు వేళ
సత్యదేవుని రూపమే సకల ధరణి
అరటి యాకులుదెచ్చి చెరుకు గడలకల్పి
నాలుగు స్తంభాలు నాటికట్టి
మంటపానికి మధ్య మంచి వస్త్రము వేసి
తండులాలు కలశ భాండముంచి
గణపతి స్థాపించి ఘనముగ పూజించి
విఘ్నముల్ నశియించ వినుతిజేసి
గౌరి మాతను నవ గ్రహముల నర్చించి
వాసుదేవుని మూర్తి భక్తినుంచి
శోడషోపచారాలతో శోభగూర్చి
పంచభక్ష్యాలు నైవేద్య మంచుజూపి
ఆవునేయి గోధుమచూర్ణమరటి పళ్ళు
శర్కరను మేళవించ ప్రసాదమిడుము
లేనివేళలో వరిపిండి పూని బెల్ల
మున్నివేదనమొనరించి సన్నుతించి
బంధుమిత్రులతో కూడి పరమభక్తి
పూజలను సేయనెనలేని పుణ్యమబ్బు
అయిదు కథలను శ్రద్ధతో నాలకించి
అన్నదానము దక్షిణలమిత ప్రీతి
అర్పణముజేసి భజనలత్యంత భక్తి
సలుపగా సత్య దేవుడే సకలమొసగు
అనియు శ్రీహరినారదమునికి దెలుపు
శుభ చరిత్రము వినిపించె సూతుడపుడు
విన్నవారికి సతతము విజయమిడును
సత్యదేవుని కరుణన సఫలమగును
స్కాందపురాణాంతర్గత
వందిత రేవా విభాగ వైభవమందా
నందముగమొదటి కథ గో
విందుని దివ్యచరణారవిందార్పణమౌ
మొదటి కథ సమాప్తం
ద్వితీయోధ్యాయం
వేదవిదుడగు విప్రుడు విమలమతుడు
కాశి పట్టణ మందున కలడునొకడు
కటిక దారిద్ర్య సంక్షోభ కారణాన
తిరుగు భిక్షకై ఇల్లిల్లు తెరువు లేక
భూసురులన వాత్సల్యము
భాసురముగ విష్ణుమూర్తి భావన పొడమన్
భాసిల్లు వృద్ధ బ్రాహ్మణ
వేసముతోకరుణ నిలిచె విప్రుని యెదుటన్
అమిత దుఃఖము నీకేల అవని నంత
సంచరించెదవెందుకు సాధుపురుష
అనుచు వృద్ధుడు ప్రశ్నించనమిత కరుణ
ధనవిహీనుడ భిక్షార్థిననుచు తెలిపి
తరుణోపాయము తెలుపుము
కరుణను నను కనికరించు కారణ జన్మా
నరుడవొ మొరవిని దయగను
మురహరివో నెరుగజాల మోహముతోడన్
అనుచు వేడిన విప్రునిన్ కనికరించి
వృద్ధుడీరీతినుడివె సమృద్దికొరకు
పుడమి సత్యనారాయణ పూజయొకటి
వాంచితార్థము దీర్చగా వరలుచుండె
అట్టి వ్రతమును సేయుము నమిత భక్తి
అష్ట దారిద్ర్యముల్ దీరు ననుచు పలుకి
వ్రత విధానము నెరిగించి భయముదీర్చ
వందనమన అంతర్ధానమొందినాడు
వృద్ధ విప్రుని బోధనే విశదమగుచు
నంతరంగమునంతటన్ హరియు నిండ
రేయినంతయు మేల్కొని హాయిగూర్చు
భజన కీర్తన మొనరించె భక్తి యుతుడు
వేకువనలేచి వేల్పును వేడ్క తలచి
భిక్షసేయగ దొరికిన విత్తమంత
వాసుదేవుని పూజకై వస్తు తతుల
పూర్తి గొనుచును వ్రతము సంపూర్తిజేసె
మాసమునకొక్క పర్యాయ మాచరించి
సకల సంపదలొనగూరి సంతసించి
భువిన పూజించి సుఖియించి పుణ్యగరిమ
విష్ణు సాయుజ్యమునుపొందె విప్రవరుడు
సత్యదేవుని వ్రతమును సలిపినంత
సకల దుఃఖముల్ నశియించి సంతసించు
కల్ప వృక్షంబు నిదియొక కామధేను
వగుచు భక్తుల కాచులే యనవరతము
అని నారద మునితో హరి
యనెనని సూతుండు పలుకనాముని వర్యుల్
గని విప్రునిచే వ్రతమును
వినిచేసిన వారిగూర్చి వివరమునడుగన్
కట్టెలమ్ముచు జీవించు కష్టజీవి
దాహపీడితుడగుచును దేహమలసి
బ్రాహ్మణుని యింట జరిపెడి వ్రతము జూసి
అడిగె వందనమర్పించి యవనిసురుని
ఏమి వ్రతమిది సలిపిన నేమి ఫలము
వివరము దెలుపగా కోర విప్రుడనియె
సత్యదేవుని వ్రతమిది సలుప నాకు
కలిగె ధనధాన్యసంపదల్ కరుణ ననియె
నమ్ముకొని మ్రొక్కి కట్టెల నమ్మువాడు
సత్యదేవుని దివ్య ప్రసాద మొంది
నేడు పొందిన ధనముచే నియమమొప్ప
వ్రతము సేయుదు ననుకొని వడిగ జనియె
స్వామి కరుణ వలన సమాకూర రెట్టింపు
వలయు నంత వస్తు వులనుకూర్చి
బంధుజనముగూడి భక్తి తో పూజించ
సకల సంపదలతొ సుఖమునొందె
అటు బ్రాహ్మణ సత్తముడును
ఇటు కట్టెలనమ్మువాడు నిరువురునిలలో
దిటవుగ వ్రతమొనరించుచు
నిట సుఖపడి సత్యలోకమేగిరి ఫలమున్
స్కాందపురాణాంతర్గత
వందిత రేవా విభాగ వైభవమందా
నందిత రెండవ కథ గో
విందుని దివ్యచరణారవిందార్పణమౌ
రెండవకథ సమాప్తం
మూడవకథ
పూర్వముల్కాముఖుండను భూపుడొకడు
సత్యవాది జితేంద్రయుసద్గుణుండు
దైవదర్శనమును కోరి దేవళమున
కేగునిత్యము విప్రుల బాగు కోరు
ధర్మచారిణి సుచరిత ధన్యజీవి
సాధువర్తని సౌందర్య శాంతమూర్తి
వర పతివ్రతయగు నిజపత్ని కలిగి
ధర్మకార్యాచరణమున తనరె విభుడు
ప్రజలు బంధువుల్ స్నేహితుల్ ప్రణుతులిడగ
రాజ దంపతులిరువురు రమ్య భక్తి
భద్ర శీలా నదీ తీర ప్రాంతమందు
సత్యదేవుని వ్రతమును సలిపినారు
కోరి సాధువుయనియెటి కోమటీడు
వ్రతముగని మ్రొక్కి రేనితో ప్రశ్న జేసె
ఏమి వ్రతమిది చేసిన నేమిఫలము
అనుచు ప్రశ్నింప నవనీశుడనియెనిట్లు
విపుల రాజ్యము సంపదల్ విమల యశము
కలిగి సుఖమయ జీవనంబలరె గాని
పుత్ర లేమిచే వేదన పొంగిపోగ
వరము గోరుచు సలిపిన వ్రతమిదనెను
వర్తకుండు వినయ వర్తియై రాజుతో
పలికెనిట్లు పుత్ర భాగ్యమకట
నాకు గూడ లేదు నారాయణున్నమ్మి
పూజజేతునయ్య పూర్ణభక్తి
అనుచునాలి జేరి అద్భుత వ్రతమును
తెలిపి నంత లలన ధిషణ చేత
సంతు గలిగినంత సలిపెద వ్రతమని
మ్రొక్కుకొనియె భక్తిమోదమలర
లీలా ధర్మ పరాయణ
శీలా లీలావతి పతి సేవనమందున్
శ్రీలక్ష్మీ పతి కరుణన
చూలాలై మురిసె ప్రకృతి శోభను గనుచున్
పదియవ మాసమునన్ శ్రీ
ప్రదమగు దివసంబునందు భాగ్యంబనగన్
సుదతీ లీలా వతి సం
పద సమ పుత్రికను పొంది పరవశమొందెన్
శుక్ల పక్ష చంద్ర సోయగంబను రీతి
కళలు శోడషంబు గలిగి వృద్ధి
చెందుచున్నవేళ చిన్నారినిన్ బిల్వ
గా కళావతి యనినారు గారవమున
నామకరణ దినోత్సవ నేమమందు
పతిని జేరి లీలావతి ప్రాణనాథ
సంతు గలిగిన వ్రతమును సలుపెదమని
శరణమని కోరితిమి గాదె జాలమేల
అనుచు ప్రశ్నించ వైశ్యుడు ననియెనిట్లు
దేవి మన పుత్రి కళ్యాణ దివసమందు
వైభవోపేతముగ సేయ వచ్చు ననుచు
చెప్పి యొప్పించె నిల్లాలి చింతదీర్చ
దుహిత యుక్త వయస్సును దొరలినంత
మంచి వరునికై దూతను పంచె సెట్టి
కాంచనంబను పురమును గాంచి మంచి
రూపసిని గుణవంతుని యోపిదెచ్చె
పరమ సంతుష్టుడై తమ భాగ్యమనుచు
మంచి లగ్నముహూర్తమునెంచి బహుళ
బంధుమిత్రుల సన్నిధిన్ వరుని గాంచి
కన్నియను దానమొసగె శ్రీ సన్నిభుండు
ధనము మిగుల గలిగి తనరు సౌఖ్యము గల్గి
బేరమందు లాభసారమెరిగి
సతత జయము గలిగి సత్యనారాయణ
వ్రతము మరచినాడు వర్తకుండు
అలిగి సత్యదేవుండిట్లు తలచి మిగుల
సుఖము గలిగిన నరునకు సుంతయైన
పరమపురుషుని భావన పట్టుబడదు
దైవమును మది నిలుపును దైన్యమొకటె
సతత దుఃఖము పొందగా శాపమిడెను
పని చేయనెరుగక తినుచు కూర్చుండిన
గిరులైన క్షణములో కరిగిపోవు
ననుచు నల్లునితోడ నాదాయమును పొంద
వ్యాపారమును సేయు భావనమున
వజ్రవైఢూర్యాలు బంగారమును గొని
రత్నసాను పురము రయము జేర
అల చంద్ర కేతు మహారాజు ధనమును
చోరుడొక్కడు దోచి భీరుడగుచు
వర్తకుల చెంత వదలుచు పరుగుదీయ
వెంబడించిన భటులంత వెదికి వెదికి
మామ యళ్ళుళ్ళ కడ గాంచి మనుజవరుని
చెంత నిలిపిరి మ్రుచ్చులన్ చింతనమున
మ్రుచ్చులము కాము ధనమును
మ్రుచ్ఛిల లేదని మరిమరి మొరలిడినన్ ని
క్కచ్చిగ రాజాజ్ఞను గొని
యచ్చెరసాలను నునిచిరి యా వర్తకులన్
ఇచ్చటిలా ఉండగా
చోరుడొక్కరుండు దారుణమౌ రీతి
సదనమందు సిరుల సంగ్రహించ
భిక్షగోరి తల్లి బిడ్డలు ప్రతి యిల్లు
దినము గడుచుకొరకు తిరిగినారు
సుత కళావతి యొకనాడు మెతుకుకోరి
విప్రవాడను చరియించు వేళలోన
సత్య దేవుని పూజించు సదనమందు
చేరి మ్రొక్కి ప్రసాదము కోరిగొనుచు
నమిత ముదమున ఇలుజేరె నర్థరాత్రి
బాలా నీ పతి లేనీ
వేళన ఈరాత్రి వరకు వీధి చరించన్
మేలా యని ప్రశ్నించిన
లీలావతికిన్ ముదమిడు లీల వచించెన్
తప్పుసేయలేదు తలపునైననులేదు
తిరుపమెత్త నేను తిరుగువేళ
పాఱునింట సత్య నారాయణ వ్రతం
బాచరించ గంటియమ్మనేడు
అని కళావతి పలుకగా మనములోన
సత్యదేవుని మ్రొక్కు సాక్షాత్కరించ
శక్తి గలిగిన రీతిలో సత్య వ్రతము
సలిపి యల్లుడిని పతిని తలచుకొనుచు
వేగ యింటికి చేర్చగా వేడుకొనియె
కరుణా పయోనిధి కమలాధి నేత యా
చంద్రకేతు నృపాలు స్వప్నమందు
కనిపించి శాసనమనిపించు రీతిగా
చక్కగా పలికె నో చంద్రకేత
కారాగృహంబున నేరస్తులై శిక్ష
ననుభవించెడి భక్తి ధనులుఘనులు
వైశ్య రత్నంబులు వర్తక శ్రేష్ఠులు
వ్రత భ్రష్టులై బహు వెతల బడిరి
వారినిన్ వెంటనే విడువ వాదులేదు
కాదు లేదని యందువో నీదు సుతులు
రాజ్య సంపద సిరులు నిర్ఘాతమగును
గాన నా ఆన పాటించ గలుగు శుభము
స్వప్న మందలి విషయమున్ సభనుదెలిపి
చర్చ గావింప వెంటనే సత్యమూర్తి
యాన రోజు శిరసావహించుటే న్యాయమనుచు
బుధులు పలుకగా భటులతోభూపుడనియె
కారాగారము గల వ్యా
పారుల సంకెళ్ళు దీసి బహు గౌరవమున్
చేరగ గొని రమ్మని యన
వారలు నొనరించినంత వైశ్యులు భయమున్
కరములను మోడ్చి మహారాజు దరికి జేర
నభయమొసగుచు విడుదలకాజ్ఞ నొసగి
దైవవశమున జరిగిన తప్పిదమిది
మోదమే గాని భయమిక లేదు మీకు
అనుచు వైశ్యవరుల కానందమొసగంగ
క్షౌరకర్మములను గలుగజేసి
కొత్తవస్త్రములను కూర్చి రెట్టింపుగా
ద్రవ్యమొసగినాడు ధరణివిభుడు
మీరు చూపిన కరుణతో మేలుపొంది
ఇంటికిని జేర నేడేగుచుంటిమయ్య
అనుచు కరములజోడించి అంజలించి
పలికినారిటు వర్తకుల్ పరమ భక్తి
స్కాందపురాణాంతర్గత
వందిత రేవా విభాగ వైభవమందా
నందిత మూడవ కథ గో
విందుని దివ్యచరణారవిందార్పణమౌ
మూడవ కథ సమాప్తం
నాల్గవ కథ
సాధువు పిదప యాత్రలన్ సలిపి విప్ర
కోటికిన్ దక్షిణల్ నిడి కూర్మితోడ
తన పురంబును జేరగా తరలినంత
తెరువులోపల జరిగెనో పరమ వింత
సాగిన వైశ్యుల గని మది
వేగపరీక్షించ దలచి విష్ణువు తా బై
రాగిగ ఎదురేగి పడవ
లోగిలిలోగలుగు సరుకు రూఢిగనడిగెన్
ధనము మత్తున పరిహాస మనము తోడ
పలికినారిటు వర్తకుల్ ఫలము గనక
ఓయి సన్యాసి ధనమని మాయజేసి
దొంగలించగ తలతువో తులువగుణము
కాలవశము చేత కారడవినుండి యీ
లతలు పత్రములను వెతల గొనుచు
పోవుచుంటిమయ్య లేవులే సిరులేవి
వమ్ముకానిమాట నమ్ముమయ్య
అనుచు వర్తకులాడిన అనృతమునట
గాంచి శాపమొసంగెను కమల పతియు
నోటనేదియు పలికిరో లోటులేక
తీవెలాకులై నిల్చునీ నావలోన
అని శ్రీమన్నారాయణుండు శపించి సముద్ర తీరమునకు వెళ్ళెను
తరిగి పోని సిరులు గిరులుగా నెలవైన
లేదటంచుపలుకురీతి తగునె
కోరుకున్నపదము నేరుగా దరిజేరు
పలుకులందు శుభము పలుక వలయు
తేలిన పడవలలో ప
త్రాలను తీవెలను చూచి ధాత్రినిబడుచున్
బేలగనేడ్చిన మామకు
బాలకుడౌ అల్లుడిట్టి భావననొసగెన్
జరిగిపోయిన విషయమునెరిగి చక్క
దిద్దుకొనవలె వగచెడి తీరు తగునె
బొంకితిమి చూడు దండితో జంకులేక
దాని ఫలమిది యతడు చైతన్యమూర్తి
సకల జగమును సృష్టించి సాకి పిదప
లయము జేయు సమర్థుడు లక్ష్మినాథు
డతని శరణన్న క్షణము వాంఛితముదీరు
ప్రీతిదర్శింతమనిగోరె కూతు మగడు
అల్లుడనిన మాట ఆనందమును పంచ
దండిజేరిరపుడు నిండుభక్తి
చరణమంటి పిదప సాధువు ననృతంపు
దోషమంత తొలగ ద్రోయుమనెను
వ్యధనుకుందుచున్న వైశ్యుని గనుగొని
ఆ విరాగి పలికె నార్యపుత్ర
జ్ఞానహీనుడవయి సత్యనారాయణ
వ్రతమువిడగ సకల వెతలు గలిగె
అది విని సాధువు యిట్లు నుతించెను
బ్రహ్మ మొదలు సమస్తదేవతలు నుతులు
జేసియు సగుణ రూపు దర్శించలేరు
విమల నిర్గుణ రూపమే విశదమౌనె
తనుమనంబు వాక్కులగన తరమె మాకు
మూఢుడను నేను మాయచే మోహితుడను
నిన్నునేరీతి నెరుగనో నీరజాక్ష
సత్యదేవుని వ్రతమును శక్తికొలది
సలుపెదను పూర్వ సంపదనలరనిమ్ము
అనవిని శ్రీహరి వైశ్యుని
ధనమును కలుగంగ జేసి తరలిన వణిజుల్
ఘన సంతసమున నారా
యణమూర్తిని గొల్చిచనిరి ఆతర్షములన్
వారి రాక దెలుపగోరుచునొక దూత
నంపినారు ముదము పెంపుగాగ
భటుడు చేరి భక్తివ్రతమును జేయు లీ
లావతికిని తెలుప హ్లాదమొందె
ఓ కళావతి వినుమమ్మ ఒక్క క్షణము
నీదు పెనిమిటి మీతండ్రి నిశ్చయముగ
నేగుదెంచిరి వెళ్ళెద జాగు లేక
వ్రతము నొనరించి పిదప సమ్మతిగ రమ్ము
అనిన తల్లి మాటనాలకించిన పుత్రి
వ్రతము వేగ సలిపి పతిని గనగ
భవ్య ఫలము గూర్చు దివ్య ప్రసాదము
వీడి పయన మైన కీడు గలిగె
తన ప్రసాదము విడిచిన తరుణిజూచి
అగ్రహోదగ్రుడై హరి అలిగి నీట
ధనముతో సహా నల్లుని మునగజేసె
దైవశాపము దప్పింప తరముగాదు
భర్త జాడగనని పడతి దుఃఖము పొంది
పుడమి పైన బడుచు పొరలి ఏడ్చె
బాల దుఃఖము జూచి లీలావతియునేడ్చె
సాధువు గని బహు విచారమొందె
ఏ పాపముదీ ఫలమో
నాపాప ముదంబు గొనుచు నడి ఝరిలోనన్
చూపునకు గూడ నోచక
ప్రాపున దుఃఖంబు నిడెనభాగ్యుడనైతిన్
తప్పులెన్నియో జరిగెను తలచకయ్య
వంచకులమని మనమున నెంచకయ్య
కన్న వారిపై కఠినము కానిదయ్య
సత్యనారాయణస్వామి శరణమయ్య
అనుచువేడిన సాధువున్ కనికరించి
ఇట్టు లనియెను శ్రేష్ఠి నీ పట్టి వ్రతము
నొనరజేసి ప్రసాదము గొనదు గాన
కష్టనష్టముల్ కలిగెను కలుగు శుభము
సత్యనారాయణుని మాట నిత్యమనుచు
మరల పూజించి భక్తితో కరము మోడ్చి
ప్రీతి నొంది ప్రసాదము స్వీకరించి
పెనిమిటికి తల్లి దండ్రికి గొనుచు చనియె
ఎదుట పరివార యుక్తుడై కదులు విభుని
కన్నులారగ గాంచెను కౌతుకముగ
సత్య వ్రతమును భక్తితో సలిపి గృహము
చేరబోయిరి కలకాల సేమమడిగి
నాటి నుండియు భక్తితో మేటివ్రతము
సతత పౌర్ణమి సంక్రాంతి సంబరమున
మరువకను జేసి ఇహమున స్థిర సుఖమ్ము
పరము వైకుంఠ ప్రాప్తిని వరలినారు
స్కాందపురాణాంతర్గత
వందిత రేవా విభాగ వైభవమందా
నందిత నాల్గవ కథ గో
విందుని దివ్యచరణారవిందార్పణమౌ
నాల్గవ కథ సంపూర్ణం
ఐదవకథ
--------&--&---
పుత్ర సమముగాను పుడమిజనంబుల
పాలనంబుజేయు ప్రాజ్ఞుడనగ
మంగలాంగుడైన తుంగధ్వజ ఱేడు
మనుజకోటి భాగ్యమనగ వెలిగె
ప్రజల బాధించు మృగముల పరగ మాన్పి
తిరిగి రాజ్యముజేరగా తరలు వేళ
నొక్క మారేడు వృక్షము ప్రక్క నిలువ
గోప బాలల వ్రతమటు గోచరించె
గోపకులు జేయు వ్రతమిది
భూపుడ నే వందనమిడ పూనగ తగునా
దాపున గల జనములు గన
నా పరువిటు నిలుచునె యని నాథుడు నిలిచెన్
స్వామివారి ప్రసాదము ప్రేమతోడ
గోపకులు నిడి మ్రొక్కిరి భూపుడంత
విడిచి వెళ్ళిన నూర్గురు కొడుకులు ధన
ధాన్య సంపత్తి నశియించ దైన్యమొందె
కనుల వ్రతము గనక కరములు మోడ్చక
నిడు ప్రసాదము గొననిష్ట పడక
గర్వ పడిన వేళ సర్వము నశియించు
నన్నభావ మెరిగె నవని విభుడు
సత్యదేవుని వ్రతమును సలుపుచోటు
చేరి భూపతి భక్తితో శిరము వంచి
గోపకులను కలగలిసి యోపి పూజ
చేరి దివ్య ప్రసాదము స్వీకరించె
సత్యదేవుని నిత్యము స్మరణజేసి
ఆయురారోగ్యమైశ్వర్యమందగించి
పుత్ర పౌత్రులతోగూడి పొంగిపోయి
అంత్యమున విష్ణు పదమొందె నవని విభుడు
కథను వినువారి గనువారి వ్యథల బాపి
బహుళ ధనధాన్య సంపదల్ ప్రాప్తినొసగి
ముదముభువిలోన పరమున మోక్షమిడును
సత్యదేవుని కరుణిడు నిత్య శుభము
దారిద్ర్యమున్ బాపి ధనధాన్యముల గూర్చు
సత్యదేవుని వ్రతము సలిపినంత
సంకెళ్ళు చేధించి స్వాతంత్ర్యమున్ బంచు
సత్యదేవుని స్మరణ సాగినంత
దైన్యము పరిమార్చి ధైర్యము కలిగించు
స్వామిచెంతన శిరము వంచినంత
వాంఛితములదీర్చి ప్రారబ్ధమును మార్చు
వ్రత కథల్ నోరార పలికినంత
సర్వ దుఃఖముల్ పోద్రోలి సంతసమును
కష్టనష్టముల్ పరిమార్చి కౌతుకమును
ఇహము సుఖమును మోక్షమునిడును పరము
సత్యనారాయణస్వామి జయము జయము
సత్యనారాయణస్వామి జయము జయము
స్కాందపురాణాంతర్గత
వందిత రేవా విభాగ వైభవమందా
నందిత ఐదవవ కథ గో
విందుని దివ్యచరణారవిందార్పణమౌ
ఐదవ కథ సంపూర్ణం
సర్వం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు

