23, మార్చి 2018, శుక్రవారం

శ్రీ రామ షోడశోపచార పూజ


శ్రీరామ గేయ షోడశోపచార పూజ
--------------------------------------------
                    (1)
శ్రీ పార్వతి నందన ఆశ్రిత జనపాలన
సకల లోక పావనా కరుణించు గజాననా
గేయ షోడశోపచార పూజ సేయ బూనితిన్ విఘ్నాలను పరిహరించి బ్రోవనిన్ను  వేడితిన్
                      (2)
షోడశోపచారములతో పూజ సేతునయ్యా రామయ్య
ప్రేమతోడ చేకొని మము కరుణ జూడవయ్య  
                          (3)
శ్రీ విష్ణువు శేషపాన్పు నుండగా -కనుల పండగా
సురలు మునులు  తము గావగ వేడగా నుతుల జేయగా
కమలా సతితో జానకిరాముడవై
మానవ రూపుడవై
మహిలోన అవతారము దాల్చిన నా స్వామికిదే
ధ్యాన్నమూ పద ధ్యాన్నమూ   
                           (4)
సుతుల కొరకు పుత్రకామేష్టి యాగమును జేయు
దశరథ భూవరునకు ప్రియ సుతుడై
సకల భువనములు సంతోషించగ జనియించిన
సాకేత పురీశునకిదె ఆహ్వానము ఆవాహనం
                           (5)
గాధి సుతుని వెంట వెడలి యాగము రక్షించగా
తాటకాది ఘన దైత్యుల తలలను ఛేధించగా
పడతి శాపము బాపి పరమేశు విలు విరచి పరమ పావనీ సీతను పరిణయమాడిన స్వామికి
ఇదే ఆసనం  హృదయాసనం
                            (6)
కైక కోర్కె జనకునాజ్ఞ  కానలలో నుండగా జనకజ సౌమిత్రులతో సరయూ నది దాటగా
నావ నడుపు గుహుని చేత పాదము గడించుకున్న
పరమపురుష రాఘవు పద పంకజముల పాద్యము
                           (7)
దండకాననాన అత్రిముని ఆశ్రమంబుజేరి అనసూయ దంపతుల ఆతిథ్యము స్వీకరించి
దీవెనలచే మునుముందుకు దీక్షబూని సాగిన
మునివంద్యు రఘురామ మూర్తికిదే అర్ఘ్యము
                           (8)

చిత్రకూట పర్వతాన పంచవటీ పంచన
పర్ణశాలలో సీతా సౌమిత్రుల సేవల సౌఖ్యము సంతోషము సంబరాలలో దేలు
సాధు హృదయ రామచంద్ర  స్వామికాచమనీయమూ
                            (9)
మాయలేడి చూసి సీత  మనసుపడీ కోరగా వెంటాడి నిజము తెలిసి వేటువేసి కూల్చగా మారీచుని మర్దించిన మహామహా బలయుతా
రామచంద్ర నీ కొనరు రమ్యసలిల స్నానమూ
                            (10)
దశకంఠుడు మాయచేత ధరణిజ గొని పోవగా
సుదతి కొరకు తరుల గిరుల శోధించుచు నడవగా
శబరీ మాత నిన్నుగని సంతసానకొలిచినా
ధన్యజేసినావు రామ కొమ్ము దివ్య వస్త్రము
                            (11)
వాలిజంపి సుగ్రీవుని వాంఛల నీడేర్చగా కిష్కిందా నగరానికి ఈశునిగా చేయగా ఆంజనేయ అంగదాది కపి వీరులు గొల్వగా
అయ్యోధ్యా సార్వభౌమ యజ్ఞోపవీతము
                           (12)
హనుమంతుని చే అంగుళి అయోనిజకు అందించి
చూఢామణి చూసి సీత యోగ క్షేమముల నరసి
విభీషణునికభయమిడీ విశ్వాసము ప్రకటించు
దాశరథి అర్పించెద శ్రీ చందన సౌగంధము
                               (13)
వనధిని లంఘించుటన్న వశమగునే  మానవులకు
శిలల వాన కురిపించి జలధిని బంధించితి వట
చిత్ర చిత్రమీకథలు నిత్యసత్య  సుచరిత లు పురుషోత్తమ అర్పించెద పసుపు కుంకుమ పరిమళాలు
                              (14)
మేఘనాథు యుద్ధమున సౌమిత్రి మూర్చిల్లిన
ఫవన సుతుని పంచి తెచ్చిసంజీవితో బ్రతికించిన
భక్తజన మందారమ భవబంధ వినాశ రామ నీలమేఘశ్యామ నీకు నిత్య నూత్నమౌ సుమములూ
                             (15)
అహిరావణ  మైరావణ నరాంతకుడు ఆదిగాగ
ప్రముఖ రాక్షసాగణంబు పడి చచ్చిరి నీ శరాల
అరివర్గ వినాశరామ అఘవినాశ శుభనామా
కోసల లక్ష్మి లలామ ఆఘ్రాణించుము ధూపము
                             (16)
పరమేశ్వర ప్రియ భక్తుడు పరమేష్టివంశజడు
అమృత నాభి యుతుండు అఖిల రాక్షసేశ్వరుండు
శలభంబై రావణుడు నీ శరాగ్ని కాలిపోయే అమిత విక్రమా  మహాత్మ అరయుమి తేజో దీపము
                                (17)
విభీషణుడు రాజాయెను విజ్ఞానము వెలుగొందెను
విశ్వమెల్ల వినుతించెను విజయ దుందుభులు మ్రోగెను
సురలు మునులు ముదమొందిరి కురిపించిరి విరుల వాన
నర నాయక ఆరగించు యధాశక్తి నైవేద్యం
                             (18)
విష్ణు వక్షస్థల మందున విలసిల్లెడు శ్రీమాతకు
కళంకమ్ములంటు కొనునె కౌసల్యా సుత రామా
రావణ చెరనున్న సీత చొచ్చెనగ్ని నీ పనుపున
ధర్మదేవతాకృతా శ్రీ రామా తాంబూలమిదిగో
                       (19)
సీత లక్ష్మణులతోడ హనుమంతుడు మొదలు గల
కపి వీరులు కొలుచుచుండ కదలిన కోదండపాణి
అయోధ్య  చేరుకొని అమ్మలఆశీస్సులంది రాజగు శ్రీ రామచంద్ర మంగళ నీరాజనము
                         (20)
శాంతమూర్తి దయా సింధో సాధు తత్వ ఇనకులేశ
దాశరథీ రాఘవేంద్ర దాస జనార్చిత  నరేంద్ర ధర్మరక్షణా మహాత్మ దాన జ్ఞాన ప్రకాశకా సీతారామ చంద్ర చేతు కోటి నమస్కృతులు
      శతకోటి నమస్కృతులు
సర్వం శ్రీ సీతాలక్ష్మణ భరత శతృఘ్న హనుమత్సమేత శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి