24, మార్చి 2018, శనివారం

నవ భావనా గీతికలు

నవభావనా గీతికలు
అమరవాది రాజశేఖర శర్మ

                         ( 1)
శ్రీ గణనాయకా సకల
శుభదాయకా సర్వ
విఘ్నముల నెడబాపరా కార్య
సాఫల్య మొనరించరా

ఎలుకనెక్కినస్వామి
ఏలికై రావేమి
తొలి పూజలను చేకొని -కవన
మొలికించ వరమొసగుమీ

                           (2)
భాసురమ్మైనట్టి
దివ్య భాసరక్షేత్ర
వాసినీ మమ్మేలవే -మృధుమధుర
 హాసినీ దీవించవే

కవన శిల్పము నాట్య
గాన చిత్రపు కళల
కధిదేవతవు నీవని - కరుణ సుధ
వరదలై మము చేరనీ

                              (3)

సీతాసమేతమై
సౌమిత్రి యుక్తమై
భద్రాద్రి వాసప్రభో శ్రీరామ
భద్రా నమస్తే విభో

హృదయార విందమను
సౌందర్య మందిరము
నీకొరకు వేచెనయ్యా శ్రీరామ
నీవందునిలగదయ్యా

                            (4)

కాలమే మారెనో
గాలమే వేసెనో
చాలమారెను లోకమూ గనగ
జాలమీ కడు పాపమూ

ప్రగతి పథమందుమా
జగతి గతియందుమా
భగవంతునిదెయందుమా కలిపురుష
పగయందుమా శేఖరా

                          (5)

కరిగెనుత్సాహమూ
విరిగె ప్రోత్సాహమూ
పెరిగె సోమరి తత్వమూ ఇలలోన
తరిగె యువతన సత్వమూ

లక్ష్యమొక్కటి లేదు
దీక్ష పట్టుట లేదు
అక్షయము సృజన గుణము కాలాన
భక్షణమ్మగుశేఖరా


                             (6)

తల్లియన ప్రేమేది
తండ్రియన భక్తేది
గురువుయన గురియేదిరా దైవమే
కరడు శిలగా మారెరా

అతిథి మర్యాదేది
అతివలకు విలువేది
అంత శూన్య మ్మాయెరా
జంతుసమమయె శేఖరా

                             (7)
సహనమడుగంటింది
సఖ్యతే మాసింది
శాంతమే సున్నయయ్యె లోకాన
స్వాంతనముదొరకదాయె

పాపమే పెరిగింది
కోపమే హెచ్చింది
లోపమే ఎరుగకుందీ ఇదిలోక
శాపమయ్యెనుశేఖరా

                          (8)

మంచితనమే మోటు
పంచుతనమే లోటు
లంచమంటే స్విటనీ- మునుముందు
ఎంచి చూడదు చేటునీ

మించినది స్వార్థము
తెంచి పరమార్థము
పెంచు సిరులే లక్ష్యమై-పరులను
ముంచుటేగద శేఖరా

                             (9)

తల్లి తండ్రీ లేరు
చెల్లి అన్నాలేరు
చెల్లెనే బంధుప్రేమ మోసాన
డుల్లెనే డబ్బు మహిమా

స్నేహశీలత లేదు
దేహ బంధము లేదు
ద్రోహమే వెల్లి విరిసే డబ్బుపై
మోహమెక్కువ శేఖరా

                         (10)

విస్తుపోయే విధము
వస్తువ్యాపారము
వాస్తవము మరచిపోయే వేదన
విస్తారమయె జీవనం

పరుల క్షేమము నాస్తి
త్వరగ పెంచగనాస్తి
పెరుగంగ నీదోస్తిలో  స్వార్థమై
ఒరిగిందిదే నేస్తమా

                          (11)

నవ మాసములు మోసి
జవ సత్వములబెంచి
భువిని నిల్పిన జంటనూ బాధింప
ఎవరి మనసెట్లొప్పునూ

బుద్ధిగా మనసార
శ్రద్ధతో సేవించ
నిద్ధరణి భారమాయె చేర్చిరే
వృద్ధాశ్రమము శేఖరా

                               (12)

కన్నవారిని వదిలి
ఉన్నబంధము విడిచి
మిన్న భర్తని తలచెడీ స్త్రీ జాతి
కన్న పూజ్యులు ఎవ్వరు

అక్కగా చెల్లెగా
మక్కువౌ అమ్మగా
చక్కనీ ప్రియురాలిగా మహిళయే
మహరాణిరా శేఖరా

                             (13)

స్వీయ క్రమశిక్షణం
మాయమైనీక్షణం
హేయమైనది జీవనం  అనుక్షణం
గాయమైనది భావనం

రోగాలకాహ్వాన
రాగాలు పలికించు
భోగమంతయు వీడెను  నిరుపేద
యోగమైనది శేఖరా

                              (14)

శక్తివెచ్చించిరి
భుక్తి కాంక్షించిరి
రక్తినిడెనారోగ్యమూ   మంచిదౌ
యుక్తికరమౌ జీవనం

కష్టమే వీడిరి
పుష్టిగా మెసవిరీ
భ్రష్టమయ్యెను జీవితం  రోగాల
కిష్టమైనది శేఖరా

                              (15)

చేలపండిన పంట
పాలు పదుగురికిచ్చి
వాలు పక్షులకిచ్చిరి ఆనాడు
జీవజాలము మెచ్చిరి

సొమ్ము తనదైనచో
ఇమ్ముగా దాచుకొని
గుమ్ముగా భోంచేసిరి  ఈనాడు
బొమ్మకీయరు శేఖరా

                           (16)

ఒకరంటె ఒకరికి
శిఖరమంటిన ప్రేమ
సకలమై బతికినారు  ఆనాడు
సఖులుగా మిగిలినారు

బేధ భావము తప్ప
మోద భావములేని
ఖేదమే పొందినారు  ఈనాడు
మోడులైరీ శేఖరా

                            (17)

డబ్బు గల వారంత
నిబ్బరంగా యుండి
ఉబ్బుతో బతికి నారు ఈ డబ్బు
జబ్బుతో చితికినారు

ధనములో సంతసం
క్షణమైన లేదని
దినదినము కృంగినారు వారలు
మనసులోనే శేఖరా

                             (18)

నీతులను విలువలను
ఖ్యాతిగా తెలిపినా
సినిమాలు ఆడగలవా పెట్టుబడి
ధనమైన పొందగలవా

మర్డర్లు రేపులు
మాఫియా గ్యాంగులు
యుద్ధాల ఫిల్ములివిగో  రికార్డు
బద్దలాయెను శేఖరా

                            (19)

స్వేదమును చిందించి
భోజనము పండించ
బాధలేమిగలనేలా  అప్పులా
రోదనలు ఆగవేల

పుడమి జనులకు రైతు
కడుపు నింపినవాడు
జడిసె బతుకును గాంచగా ప్రాణముల్
విడిచె గదరా శేఖరా

                          (20)

ఆలుపిల్లల బతుకు
గోలగోలగ జేయు
కాలకూటమె మద్యమూ  వదలక
ఏలబతుకుట సాధ్యము

నమ్ముకొను వారలా
కమ్ముకొను కష్టాలు
చెమ్మగిలు కళ్ళజూడు తాగక
తెమ్ము ముదమును శేఖరా

                          (21)

నీడనిచ్చే తరువు
కూడునిచ్చే పరువు
కొట్టగా మనసేలరా ఇలకూల
నెట్టగా భవితేదిరా

పుట్టిన రోజొకటి
పెళ్ళి రోజున ఒకటి
చెట్టు పెట్టి చూడరా పెరుగంగ
సంతోషమే శేఖరా


                          (22)

ప్రాకృతిక వనరులు
సుకృతిన దొరికాయి
వ్యర్థమును సేయబోకు  దీని పర
మార్థమును వీడబోకు

నీటినీ గాలినీ
వీటితో భూమినీ
నీటుగానుంచవయ్యా కలుషితం
వేటితో సేయకయ్యా

                            (23)

పాపలన దైవాల
రూపాలు వారిపై
కోపాలు చూపకండి వారిలో
లోపాలు చూడకండి

నీతులను నేర్పించి
ఖ్యాతిగను జీవించు
కథలసారము తెలుపుమూ  జగతికి
హితునిజేయుము శేఖరా

                          (24)

ప్రభుత సొమ్మంటేనె
ప్రజల సొమ్మేకదా
వ్యర్ధమెందుకు సేయుట ఎడతెగని
స్వార్థమెందుకు చూపుట

వీధి నీటి కుళాయి
వీథిలైటనకోయి
నీదియని తలచమేలు భవితకై
నిధిగ నిల్పుము శేఖరా

                          (25)

నీవు వేసిన చెత్త
నిన్ను ముంచెడి కొత్త
చావురోగము దెచ్చునూ తెలుసుకో
నిన్నె హేతువు సేయును

నీ యిల్లు శుభ్రము
నీవాడ శుభ్రము
నీఊరు శుభ్రమవగా గొనె దీక్ష
స్వచ్చ భారతి శేఖరా

                           (26)

పశువులను పక్షులను
బలిసేయబోకుము
అవికూడ ప్రాణ తతులె  దేవుని
సృష్టికిని వారసులులే

నీటి వసతినిజూపి
నోట గింజల నిచ్చి
చోటు నిలువగ నీయుడి దైవమా
చోట నిలుచును శేఖరా

                            (27)

ఇలనాడు పిల్లలను
చులకనగ చూడకు
పాలకడలికి బిడ్డలూ ప్రేమ మురి
పాలు పంచెడి పాపలు

అన్ని రంగాలలో
ఉన్నతత్వము పొంది
వన్నెతేగలుగువారు బాలికలు
పుణ్యపంటలు శేఖరా

                           (28)


సంసారమున చిచ్చు
హింసాయుతపు రొచ్చు
ముంచేను సీరియళ్ళు చూడకు
మంచేమి లేని పొల్లు

రోజుకో రగడతో
రాజుకొన చూడగా
ఫోజులిచ్చును టీవీలు మెదడున
బూజుపట్టును శేఖరా

                         (29)


కాలమును హరియించు
ఆలోచనను మాన్పు
స్మార్టు ఫోనుల వైనము తెలుసుకొని
వాడుటే నీ లౌక్యమూ

చదువు చెడనీకోయి
విధులచెడి పోకోయి
అదికూడ వ్యసనమేరా ఫోనుతో
అదుపునుండుము శేఖరా


                       (30)

పుస్తకము పఠియించు
మస్తకము వికసించు
చాదస్తమనుకోకుమా విద్యకు
అస్తమయమే లేదురా

నడయాడు గురువుగా
కడలేని తెలివిగా
విడమరచు నేస్తమగును పుస్తకం
జడుపు మాన్పును శేఖరా

                          (31)

కూరగాయల కల్తి
కోరుపండ్లలొ కల్తి
క్షీరమే ఘోరమాయె నూనెలం
దూరకే కల్తియాయె

నీటిలో కెమికలూ
గాలిలో కెమికలూ
పంటలో కెమికలటరా మనిషిలో
ఎముకలయ్యెను శేఖరా

                           (32) తెలివినభినందించు
కలమునభినందించు
బలమునభినందించరా - మేల్గోరు
గుణమునభినందించరా

దాతనభినందించు
నేతనభినందించు
నీతినభినందించరా - మెండుగ
ఖ్యాతినొందుము శేఖరా


                        (33)

నవ్వు సంధానించి
పువ్వులా జీవించి
రువ్వరా పరిమళాలు - దశదిశల
కివ్వరా తేనియలను

మనిషిగా పుట్టాము
ఘనుడిగా ఎదగాలి
వెనుకడుగు వేయబోకు - ఏనాడు
కనుము లోకము శేఖరా


                      (34

 సిరులొచ్చునావెంట
ఒరులొచ్చునావెంట
ధరణిజేసిన పుణ్యమూ కడవరకు
వరముగా వెంబడించు

పరులకుపకారమూ
నిరతమొనరించుట
హరికిష్టమైన కర్మ తెలుసుకో
మురిపెమబ్బును శేఖరా


                       (35)
 
మోసాలు ద్వేషాలు
రోషాలుదోషాలు
వేషాలు వేయబోకు - బ్రతుకులో
పాషాణ రూపుగాకు

కోపాలు తాపాలు
లోపాల కూపాలు
శాపాలుగా మారును - ఒనరించు
పాపాలురా శేఖరా


                     సశేషం


అమరవాది రాజశేఖర శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి