6, నవంబర్ 2020, శుక్రవారం

నా హృదయంలో నిదురించే చెలి

      గణేశస్తుతి

             (1)


శ్రీ గణేశ చిద్విలాస

వేగ కరుణ చూపము

రాగముతో హరివిల్లుల

రచన సాగ జేయుము

     

       సరస్వతి స్తుతి


               {2}

భాసర వాసిని భారతి

మదినిలువగ వేడితి

పదపదమున నిలిచి మధుర

భావము నిడ కోరితి



        ఇష్టదేవతా స్తుతి


                 ( 3  )


సీతా లక్ష్మణ మారుతి

సహిత రామ చంద్ర జయము

నిను నిత్యం తలచిన మది

పొందును గద నిత్య శుభము



        అమ్మనాన్నలకు వందనం


                    (4)


తనువునిచ్చి ప్రాణమిచ్చి

ధరణిలోన నిలిపెనమ్మ

రక్తము పాలుగ మార్చి

పెంచి పెద్దజేసెనమ్మ


                    (5)


నామాట నాపాట

మానాన్న స్వరము

నాఘనత నా చరిత

మానాన్న వరము


                   (6)


నాదారిలో ముందు 

నడిచింది నాన్న

దారంట ఈ పూలు 

పరచింది నాన్న


                    (7)


పుడమిలోన కనిపించే

దేవతలు తలిదండ్రులు

ప్రణుతులిడుదు పరవశించి

వారు ప్రాతఃస్మరణీయులు



      గురువునకు వందనం


                      

                      {8}


అక్షరాలు నేర్పించి

 రంగరించి అనుభవాలు

జ్ఞానము కలిగించిన గురు

దేవునకిదె వందనాలు


                        (9)


హరివిల్లులలో భావన

హిమవన్నగ శిఖరము

హరివిల్లులలోన  భాష

నవనీతసమానము



                ( 10)


నింగిలోని చందమామ

నేలపైన వాలింది

నవ్వువెన్నెలలు చిలికే

చెలి మోముగ మారింది


             (11)


గుండె బావిలో దాగిన

ప్రేమ వెలికి తీసింది

నవ జీవన గమనానికి

కొత్త దారి చూపింది


             (12)

నవ్వు పూల బాణాలు

రువ్విందొక సారైనా

జ్ఞాపకాల దొంతరగా

నిలిచిందీ హృదయాన


              (13)

నీలికళ్ళ ఆకాశం

భావాలకు పుట్టినిల్లు

చదువగలుగు మనసుందో

సరసాల విరిజల్లు


                (14)

ఓరకంట రచియించును

వేల ప్రేమగీతాలు

సారమంత వినిపించును

మ్రోల మధుర రాగాలు


               (15)


పెదవుల కదలిక సృజించె

పలుమాటల హృద్ఘోష

ఎద సొదలను వివరించగ

 ఎనలేనిది మౌనభాష


                    (16)

మెలుకువలో మురిపించును

మదికోరిన చెలి రూపం

"కల" వరమై కలవరమై

నిశి నిదురకదే శాపం


                       (17)


చెరుకురసం చెలిపలుకులు

వేసుకున్నదీ పంతం

తరగని మధురిమ కుదరని

చెరుకు ఓడెనాసాంతం


                         ( 18)


చెలికబురుల మోసుకొచ్చె

నేమొ గాలి చల్లదనం

పులకరించి పరవశించి

ఊగె మనసు పూలవనం


                          (19)


ఝుంఝుమ్మని తుమ్మెదలే

పూవులతో గుసగుస

అది గని పడమర దిశ గొనె

నున సిగ్గుల రుసరుస


                          (20)

కనులముందు చెలి ఉంటే

యుగాలన్ని క్షణాలు

కనిపించని తరుణంలో

క్షణాలౌను యుగాలు


                         (21)

తటిల్లతగ కనిపిస్తే

ఆకలేల దాహమేల

తృటికాలం మరుగైతే

ఆకలేల దాహమేల


                            (22)


విషయము ఏదైతేనేం

నీ మాటలలో వినాలి

మోము హావభావాలను

మనసారా కనాలి


                             (23)


బెట్టు చేసినపుడు రెండు

మెట్లు దిగితె నష్టమేమి

పసితనమును గను యోగం 

 కలుగ మించు భాగ్యమేమి


                             (24)

తనకు బాధ కలిగించే 

మనిషైనా ఘటనైనా

మనకు కూడ శత్రువు కదా

క్షణమైనా యుగమైనా


                               (25)


ప్రేమంటే ఇవ్వడమని

కానుకకై వెతికినాను 

మనసుకన్న వేరేదని

కడు ప్రేమతొఇచ్చినాను



                               (26)


నా కనులకు నీరూపం

కలిగించును ఆనందం

నిను గూర్చిన యోచనలో

పులకించును నా డెందం



                          (27)



తరిగి పోని కరిగి పోని

సంపద ఏముంటుంది

అని అడిగితె నీ ప్రేమని

మనసు విన్నవించింది



                  


                        (28)

ప్రేమ క్షీరసాగరాన్ని

మదించగా తెలుస్తుంది

హలాహలంకాదు దివ్య

అమృతమూవరిస్తుంది


                       (29)

చిరుగాలి సవ్వడిలో

నీ రాకను చూస్తున్నా

ఆ చల్లని తాకిడిలో

పులకింతై పూస్తున్నా


                          (30)

ప్రతి కదలిక రేపుతుంది

నాలో భావోద్వేగం

పాటలుగా మాటలుగా

విరిసిన సంధ్యారాగం


                            ( 31)


మరువలేని మరచిపోని

మధురమైన జ్ఞాపకాలు

నను వీడని నీ ఉనికిని 

ఎగరేసిన బావుటాలు


                               (32)


క్రొత్త ఆశ చిగురిస్తే

ఆమనికది ప్రతిరూపం

పెను కోపం కనిపించిన

అదే గ్రీష్మభఋతు తాపం


                         (33)

దయ కన్నుల కురిపించిన

అదే వర్ష క్రతువు

ఆనందపు సిరివెన్నెల

అలర శరదృతువు


                           (34)


వణికించే వేదనలో

మునిగితివో  హేమంతం

బాధలన్ని రాలిపోతె

శిశిరమె కద ఆసాంతం


                           (35)

కనులెరుపై ప్రసరించే

కోపంఎండాకాలం

చురకత్తుల చూపులు దహి

యించే నిప్పులగోళం


                             (36)


నీ ప్రేమను వర్షములా

కురిపించిన వేళ

హృదయంలోఆనందపు

 విరిమొలకల హేల


                          (37)


హిమశీతలమనిపించెను

సరసం సల్లాపం

చిరు కలహాలేకూర్చెను

నులివెచ్చని తాపం


                          (38)


లోకమంత ఒకవైపు

ప్రియభామిని ఒకవైపు

నిలిచిన వేళన హృదయం

చేరెను రెండోవైపు


                           (39)


నిన్నుగన్న వేళ కళ్ళు

వెన్నెల లోగిళ్ళు

జాడతెలియకుంటె నదీ

నదముల పరవళ్ళు


                            (40)

కెరటాలై ఉప్పొంగిన

సంతోషంనీవే 

చిరుగాలై ఏదమీటిన

స్వాంతనమైనావే 


                           (41)


నామాట నీమాట

కలిసి యుగళగీతం

జీవితాన ఆనందం

పంచిన సంగీతం


                          (42)

ఆశలెన్నొ చిగురించిన

కొత్త జీవితం నాది

విచ్చేసిన ఆమనికి

నీవే కద పునాది


                           (43)


నీ ప్రేమే వర్షముగా

హృదయం తడిసింది

ఎదనిండుగ సంతోషం 

మొలకల పొడమింది


                          (44)



నీవే ఒక కెరటమయి

పాదం స్పృశియిస్తావు

అంతలోనె దూరంగా

కడలిన కనిపిస్తావు


                          ( 45)




మనసారగ నిను చూసి 

మైమరచి పోతున్నా

కనులుమూసినా తెరచినా

మరవలేక పోతున్న


                             (46)


గాలివెదురుసోకి మధుర

రాగమాలపించింది

నీ పిలుపున నాపేరే

రమ్యమై నిలిచింది


                           (47)

నీ ఊసులు లేకుండా 

మాటాడేదేముంది

ఊహలలో నువు లేక

ఆలోచన రానంది


                          (48)


ఆనందానికి రూపం

నా ఆశల ప్రతిరూపం

నీవే నా వేదనల

చీకటి బాపే దీపం


                        ( 49)



కలికి రంగవల్లిక యై

అరుదెంచిన ఈసమయం

అలికి సిద్ధమై వేచిన

ముంగిలి నా హృదయం



                       (50)


నీపైన నాప్రేమ 

అంతులేని ఆకాశం

ఆపైని తారకలే

మురిపించిన అవకాశం


                         (51)


గీతంలో చరణాన్నై

మనసుదోచుకుంటున్నా

పల్లవిగా రావాలని

నిన్నుకోరుకుంటున్నా


                  (52)

నా యోచన పథానికి

నీవే ఒక గమ్యం

అను నిమిషం నిను జేరె

తలపులు బహురమ్యం


                  ( 53)


ప్రశాంతమై వైఫైలా

చుట్టుకున్నదేమొ నిన్ను

దరిజేరిన ఆసాంతం

ఆవరించెలేనన్ను


                     (54)

నీ మౌనం మాటలుగా

వినిపించును నాకేలా

నా మాటలు మౌనంలా

కదిలించవు నిన్నేలా


                       ( 55)


నమ్మకమే పునాదిగా

కమ్ముకున్న ప్రేమ

నమ్మలేని సాంత్వనమును

మదికిడునని ధీమ


                        ( 56)


కమ్మని కలలైనాయి 

నిదురలేని రాత్రులు

తెమ్మెరలై వీచినాయి

నినుగూర్చిన ఊహలు


                             (57)

నోరొకటే మాటాడే 

సాధనమని అనుకున్నా

కనులు మనుసు లోని సొదలు

పలుక నేడు వింటున్నా



                          (58)

జీవితమే ఎడారిలా

పరితపించు వేళ

నీవే ఓయాసిస్సై

మురిపింతువు గద చాలా


                       (59)


కుండిలోని పూలమొక్క

నిండుగానె విరిసింది

పండుగల్లే నీ నగవే

నిండుహృదిన మెరిసింది


                           (60)

నా పక్కన నువ్వుంటే

ప్రపంచానికధినేతను

నేనొక్కడినే ఉంటే

దిక్కులేని అనాథను



                            (61)


నీ మాటల సరిగమలు

సుప్రభాత గీతాలు

నీ లాలన మధురిమలు

జోజో సంగీతాలు


                           (62)


ఊహల సామ్రాజ్యాన్ని 

సొగసుగ నిర్మించాను

నిన్నందున మాహరాణిగ

నిలుపుకొని మురిసాను


                         (63)


నీపైన నాభావము

కడలెరుగని ఘన కడలి

అదితెలిపే నాభాష

చిరు గరిటెన నీరు చెలి


                         (64)



మౌనాన్ని ఓడించి 

మాటాడాలని ఉంది

ఎదురుపడిన ప్రతీక్షణం

ఆ మౌనమె జయిస్తుంది


                         ( 65)


నీ పాదం తాకాలని

కదలుతున్న కెరటాన్ని

నా చలువను పంచాలని

కోరిన ఆరాటాన్ని


                        (66)


 

ప్రసరించే వెచ్చదనం

నీచూపుకు గలనైజం

నా మది నీహారమును

కరిగించిన పచ్చినిజం


                          (67)


అందమనేనెయ్యివేసి 

వండిన బిర్యాని

కనులనిండ తినిపెడితే

మనసునిండు జాని


                            (68)


ఘనీభవించిన నామది

నిన్గనని వేదనలో

కరిగి కరిగి కన్నీరై

జాలువారె కన్నులలో


                            (69)


ఈ చల్లని చిరుగాలి

తాకి మురిసె తనువేమొ

బహుశా ఇంతకు మునుపే

నిన్ను తాకి వచ్చెనేమొ


                              ( 70)


పట్టపగలు ఉదయించిన

జాబిలిలే నీ వదనం

వెన్నెలలై విరబూసిన

చిరు నగవులపూలవనం


                                (71)


నీ మోమున చిరునగవు

కలకాలం నిలవనీ

నేనడిగిన ఈ కోరిక 

భగవంతుడు తీర్చనీ


                            (72)



ఎదలోని భావాలు

నయాగరా జలపాతం

పది చినుకులు నినుచేరిన

చాలు ముదమె అనవరతం


                            ( 73)


ప్రేమ పరిమళం పంచే

మల్లెపూల తీగవనీ

పందిరినై పరుచుకున్న

ఆలంబన కావాలని


                            (74)

కాలం పరుగుల రాణి

నీతో కలిసున్నప్పుడు

ఆ కాలమె గిరి కరణి

నాతో నువు లేనప్పుడు 


                             (75)


నా ఆశకు రూపమిచ్చి

అందమైన మనసునిచ్చి

పోల్చుకుంటె నీవే కద

అందుకు నీవంటె పిచ్చి


                             (76)


అంతరంగ భావాలు

విహరించే విహంగాలు

ఊతమిచ్చి ఊపునిచ్చు

నింగే కద ప్రియురాలు



                    ( 77)


నీ కలయిక నిచ్చెనగా

నిను గానక పాములుగా

జీవన వైకుంఠ పాళి

ఆడుతున్న ఒంటరిగా



                       (78)


హాయ్ అని నీ పలకరింపు

మృదు మధురపుగానం

నవనాడులకుత్తేజం

నొసగిన బహుమానం


                      (79)


పసిపిల్లగ నువుచేసే

అల్లరి నా సుకృతం

నను శాసించే పెద్దగ

మాటలె మధురామృతం


                     ( 80)


చెంగావి రంగు చీర

దాల్చి సాగు నీపయనం

తూరుపు అరుణోదయమును

తిలకించెను నా నయనం


                     ( 81)


హరిత వర్ణ వలువ లోన

అలరిన నీ రూపము

పచ్చనైన పంటచేల 

పుడమియె కద నిక్కము


                   (82)


సిరివెన్నెల కోసము ఈ

చకోరాల ఎదిరిచూపు

నీ చిరునగవుల కొరకు 

వేచితి గద నీ దాపు


                  (83)


నామాటలు నా చూపులు

నటన అని పలుకబోకు

అంతరంగమును పొడమిన

సుమలత అది మరువబోకు


                     (84)

నీ కనులు నను గను తరి

వేయి వాల్ట్స్ బల్బు కాంతి

నీ మోమున కనుగొంటిని

అదే ప్రేమ కదా యింతి



                      (85)


నీ గురుతుల కొరకు వస్తు

వులను చేరి అడుగుటేలా

పదిలంగా దాచుకున్న

నా మదిని అడగవేల


                      ( 86)


మేడలు మిద్దెలు వద్దు

మీరిన సంపదలొద్దు

కలకాలం ననువీడక

నువ్వుంటేనే ముద్దు



                        (87)


మనసులోని భావాలను

కనుల కపోతాలతో

నీమది చిరునామాకు

పంపినాను ప్రేమతో


                          ( 88)


రచన సేయ వస్తువుకై

మనసుపుటల త్రిప్పినాను

ప్రతి పుటలో నీవైతే

వేల కవితలల్లినాను



                           (89)


నిలిచి ఉన్న నామనసును

మాటన నడిపిస్తావు

పరుగులెత్తు యోచన నా

మాటల నిలిపేస్తావు



                         ( 90)


నిదుర సీమ విహరించిన

మధుర స్వప్నముదయించెను

పెదవులపై చిరునగవుల

సుధగ నిన్ను మది గాంచెను



                         (91)


ప్రాణికోటి మేలుగోరి

కదులు పుణ్య నదివి నీవు

అలసిననిను అక్కునగొను

కడలినేను తెలుసుకోవు


                             (92)


నీ ఒడిలో తలవాల్చి

నిదురించేవేళలో

లోకం దాసోహమంది

ధైర్యపు లోగిళ్ళలో


                           ( 93)


మృదుమధురపు నీ మాటలు

నాదారిని మార్చినాయి

అలుకల కులుకులు మంచిని

అలవోకగ తెల్పినాయి


                           ( 94)


కరిగి పోవు కాలంతో

కరిగి పోని మనప్రేమ

ప్రళయ ఉరుము గర్జనతో

బెదిరిపోని చిరునామా


                             ( 95)


నాపై గల నీప్రేమ

పసిపిక్ మహ సాగరము

నాపైన నీధీమా

ఎవరెస్ట్ హిమవన్నగము


                             (96)


నీ చూపుల జడివానలొ

చిత్తడిగా తడిసాను

నీ నగవుల కిరణాలలొ

నులివెచ్చగ మురిసాను


                            ( 97)


చల్లని చలిలో ముకుళిత

మోహనమే నీ అందం

నా యెద వెచ్చదనానికి

వికసించిన అనుబంధం


                               (98)


చినుకై నువు భువిచేరగ

వెలుగైనిను కలిసెను మది

ఏడురంగులున్న ప్రేమ

హరివిల్ల్లై విరిసినది



                               ( 99)


గేయంలో ప్రతి అక్షర

మై నిలిచిన మాట నిజం

రాగంలా మురిపించిన

నీవుకూడా నిజం నిజం


                            ( 100)


పలురంగుల విరిమాలగ

లోకం నిను నుతియించగ

దారంలా నీ ఉనికిని 

నిలుపుతాను కడు ప్రేమగ


                         (101)


మట్టినంత దాచుకున్న

పూలకుండినైనాను

పూలమొక్కవై నిలువగ

చూసి సంతసించాను


                           ( 102)


గోదావరి తరంగాల

మెరిసె భాను కిరణము

నా హృదయపు రంగముపై

నిను నిలిపిన వైనము


                            ( 103)


నాకు ఉన్న పని యొక్కటె

నిన్నారాధించడము

తుమ్మెదలా నిను చుట్టి

మోదము కలిగించడము


                             (104)


నీమాటలు మధురిమకు

చూపును గద అర్థము

ఎన్నడిడదదేమిటో

కలనైన అపార్థము


                              (105)


నీ మౌనం ఎన్నెన్నో 

భావాలకు పుట్టినిల్లు

నీకోపం నా భవితను

చిగురించే వానజల్లు


                          ( 106)


సూర్యోదయమయ్యిందని

తూరుపుదెస చూడనేల

నీ మోమున అలరారె

తిలకమును గన మ్రోల


                       (  107)


నీ పెదవులు ఇడు మాటలు

నా మనసును దోచెనులే

వేణుగాన రవళి వలే

అనునిమిషం తోచెనులే


                        ( 108)


అయ్యారె నీమోమున

విరిసిన నగవుల బోనము

సరితూగదువేలాది

రూపాయల బహుమానము


                         ( 109)


జీవితమను రథమునకు

కలవు రెండు చక్రాలు

ఒకటి నీవు ఒకటి నేను

లేవిక సందేహాలు


                          ( 110)


మత్తులోన తూగుతుంటే

ఆనందమె ఆనందం

ఆ మత్తే నీవైతే

అదియే పరమానందం


                         (  111)


అనుకోని సంఘటనలు

శిలగా మార్చేసాయి

నీ దరహాస పరాగం

నను మనిషిని చేసాయి


                            (112)


అరవిరిసిన పుష్పంలా

ఊయలలూగేస్తుంటే

చిగురాకుల గలగలగా

లాలిపాట నేనంటే


                           (113)


మావిచివురులా నీవు

మత్తురేపితే చాలు

గండు కోయిలై నేను

పాడుదులే గీతాలు


                        (114)


నీ హృదయపు కిటికీనై

నిన్ను కోరి నిలిచిపోని

ఈ లోకపు పరిచయాన

యానకమై వెలిగిపోని


                        (115)


నీ సంతోషం నేను

నా సంతోషం నీవు

నీవు నేను ఒకటైతే

కడగండ్లే లేవు లేవు


                          (116)


నీ గుండెల సవ్వడులు

నాకేదో చెబుతోంది

తీయని సంగీతాన్ని

నా మనసే వింటోంది


                    ( 117)


చలిగాలికి వణుకువేళ

నీవొక వెచ్చని కుంపటి

మండుటెండ సాగు వేళ

చిరుగాలికి నువు సాటి


                           ( 118)


కనులు మూసి చూస్తున్నా

నీ కమ్మని రూపాన్ని

ఏ రవివర్మో గీసిన

అందమైన చిత్రాన్ని


                            (119)


తళుక్కుమని మెరిసింది

గగనంలో సౌదామిని

గమ్యమును చూపింది

నీరూపము పులుముకుని


                             (120)


చీకటి ఆకాశాన్నై

దిగులుపడిన ఈ సమయం

సంతసాల వెలుగిడె నీ

నగవుల చంద్రోదయం



                          ( 121)


సాగుతున్న నా అడుగుకు

లేదిక ఒంటరితనము

నీ అడుగులు కలిసి మెరిసె

జంటగ చురుకుందనము



                           (122)


ఆకర్షణ విషయంలో

నీ మది సూదంటురాయి

నిను చేరిన తరుణంలో

లోహమునై నిలిచితోయి



                         (123)


చిరుగాలి నీ కబురులు

మోసుకొని ననుచేరి

మురిపాల ముచ్చట్లు

వినిపించెను సుకుమారి



                         (124)


తపన తపము గా మారె

ప్రతి నిమిషం నీకోసం 

కనిపించిన చాలు మదికి

ఒనగూరును మధుమాసం



                        (125)

వేదనలే మండుటెండ

లా వేడిమి కురిసినా

హిమశీతలమై చేరి

చల్లదనం పంచనా


                        (126)


నీ మనసును చదివినాను

నీవడిగినదిస్తాను

నీ మోమున చిరునగవును

చెరగనీక చూస్తాను


                          (127)


గుర్తు పెట్టుకున్నాను

నిన్ను మరచి పోలేను

కాదుకాదు గుండెల్లో

నిన్ను నిలువుకున్నాను


                         (128)


నువ్వాదరిపై నున్నా

నేనీదరిపై నున్నా

మన మనసులు కృష్ణమ్మై

కలుపడమూ చూస్తున్నా


                        (129)


నమ్మకమే దేవుడట

నమ్మకమే జీవమట

నమ్మితి నువు సొంతమని

నమ్మిక నిజమౌతుందట


                         (130)


తరిగిపోవు ధనమేల

విరిగిపోవు వస్తువేల

కరిగిపోని ప్రేమ ఉన్న

సిరిసంపద మాటేల


                          (131)


సంతోషం విరబూసిన

నువు గుర్తుకు వస్తావు

కన్నీటి కడలెగసిన

నువ్వే కనిపిస్తావు



                           (132)


అలక మంచు కురిసి నీవు

మొగ్గలాగ ముడుచుకోకు

నునువెచ్చగ బతిమాలే

నను ఎన్నడు మరచి పోకు


                        (133)


బీటలువారి ఎండిన

భూమికదా నా హృదయం

నీ స్నేహం చినుకు సోక

పులకరించునీ సమయం


                         (134)


నా పంచ ప్రాణాలకు

రూపమిచ్చి చూస్తె నీవు

నా ప్రియాతి ప్రియమైన

వస్తువువై నిలిచినావు


                          ( 135)


పర్ణశాల ఐన గగన

మంటు మేడ ఐనాసరె

నీవు ఉంటె స్వర్గ ధామ

మౌను వెలుగు నయ్యారె


                          (136)


ఒంటరిగా యోచిస్తే

చావుకు నే బానిస

జంటగ నువు కలిసొస్తే

బతుకునకొక భరోస


                         (137)


నీ కళ్ళు మేఘాలై

ప్రేమను వర్షిస్తుంటే

నా మోమున ఆనందం 

మొలకలుగా మొలవదటే



                          (138)


నాబలము నా ధైర్యము

నువు కురిపించే ప్రేమ

కడలేని ఆనందము

అందించే చిరునామా



                          (139)


నాఊహలు కవితలుగా

రచనలు చేసాననుకో

ఆ కవితల నాయకివి

నువ్వేనని తెలుసుకో



                           (140)


నిను గానని నాడు నాకు 

నింగి నంటు కోపము

ఆ కోపము నీపై గల

 ప్రేమకు  ప్రతి రూపము


                         (141)


నీ కన్నులు సంతసాన

వెలుగులీన నిండుగ

నాడే పలు దివ్వెలున్న

దీపావళి పండుగ 


                           (142)


వెనువెంటనె నడయాడె

తోడగు నీడవు నీవు

చీకటినైనా వీడని

పెను బంధమువైనావు


                              (143)


కలవా కానే కావు

మెళుకువలో విడడానికి

తలపే మరి కావుకావు

నిదురన విడి చనడానికి


                             ( 144)


మౌనం కన్నా భాషా

వేరుందా లోకంలో

నీపైనా నాప్రేమను

పలికే మధు భావంలో


                          (145)


నీవలన నాకొక ఉప

కారం కావలెను చెలి

నాతోడుగ నీవుండే

వరమునిడురా నెచ్చెలి


                         (146)


రాళ్ళపైన నీ పేరు

అందంగా చెక్కలేను

నాగుండెన చెక్కకుండ

కలనైనా ఆగలేను



                           (147)


నన్నునాకు చూపించే

అందమైన దర్పణం

నీవే కద చెలి అందుకె

సర్వమూ సమర్పణం


                           (148)


ఆ కొమ్మకు విరబూసిన 

సుమబాలవు నువ్వు

ఆ పరిమళమును పంచును

సిరులొలికే నీ నవ్వు



                        (  149)


గత జన్మల బంధమేమొ

చెలియా మనదగు ప్రేమ

నదీ కడలి కలయికగా

వెలుగొందినదీ గరిమ


                    (  150)


అనునిత్యము నూతనంగ

పల్లవించి మురిపించును

పాతదనం లేని ప్రేమ

గలుగ మనసు పులకించును



                    (151)


ప్రేమ అనే మాట పిచ్చి

తనమని భావింతురొకో

పిచ్చివాడినే నేనని

ఒప్పుకుందు తెలుసుకో



                   ( 152)


నీ బుగ్గల గులాబీలు

పూసిన నును సిగ్గులు

నామోమున విలసిల్లెను

చిరునగవుల మొగ్గలు 



                    ( 153)


ఎంత కష్టమైనా సరే

నీకోసం భరిస్తాను

ఎన్ని బాధలైనా సరె

నీకోసం సహిస్తాను



                         (154)


నాకున్నది కడు స్వార్థం

నా నువు బాగుండాలని

నా నవ్వులకిక అర్థం

నా నువు బాగున్నావని


                           (155)


వందమందిలో ఉన్నా సరె

నీ ఉనికే తెలుస్తోంది 

వేయి పనులనున్నా సరె

నీగూర్చే తపిస్తోంది 



                           (156)


గలగలపారే నదిలా

నీమాటల మధురిమలు

అలసట దూరంచేసే

ఉత్సాహపు సరిగమలు



                           (157)


నిండగు మేడన రాణిగ

ఉంచగలనొ లేదో నిను

గుండెను గుడి చేసి ప్రేమ

దేవతగా నిలిపెద విను


                              (158)


ఎదిరిచూపులోని మధుర

వేదనలో ఏమున్నది

నిదురన మెలుకువలోన

నిను తలచెడి గుణమున్నది


                            (159)


బంగారంతో పోల్చను

విలువ హెచ్చి తగ్గుతుంది 

ధనమునకు కాలానికి 

నీ ప్రేమే లొంగనంది


                 (160)


వెంకటేశ తిరుమలేశ

శ్రీనివాస పాహిమాం

కలిదైవమ  కరుణనుగను

దీనబంధు రక్షమాం





                        అమరవాది రాజశేఖర శర్మ






               


         













































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి